• కాకినాడ బీచ్ కొత్త సొబగులు సంతరించుకోనుంది పర్యాటకులు వీక్షించేందుకు యుద్ధ సేవల నుంచి నిష్క్రమించిన ఐఎన్ఎస్ కోజికోడ్ నౌకను ఎయిర్ క్రాఫ్ట్ను బీచ్ లో ఏర్పాటు చేసేందుకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చేందుకు తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు అంగీకారం తెలిపారు. కోజికోడ్ యుద్ధనౌకను కూడా ఇచ్చేందుకు తూర్పు నౌకాదళం సూచనప్రాయంగా అంగీకరించింది దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి వారిని ఆదేశించింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అర్బన్ అసెట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.


  మూడు దశాబ్దాలు సేవలందించిన ఐఎన్ఎస్ కోజికోడ్
  భారత నౌకాదళంలో సుదీర్ఘ సేవలందించిన ఐ ఎన్ ఎస్ కోజికోడ్ యుద్ధనౌక ఈ ఏడాది ఏప్రిల్ 14న సేవల నుంచి నిష్క్రమించింది. ఈ నౌక 1988 డిసెంబర్ 19న రష్యాలో తయారయింది న్యాట్యా క్లాస్ మెన్ స్వీపర్ నౌకల్లో ఐ.ఎన్.ఎస్ కోజికోడ్ ఆరో నౌకగా నౌకాదళంలో సేవలను ప్రారంభించింది. అప్పటి నుంచి తూర్పు నౌకాదళంలో మూడు దశాబ్దాలుగా సేవలందించింది. ప్రస్తుతం విశాఖ నేవీ జట్టి లో ఉన్న దాన్ని తీసుకొచ్చి కాకినాడ బీచ్ లో ఉంచితే పర్యాటకంగా ఆకట్టుకుంటుందని భావించిన గూడా అధికారులు తూర్పు నౌకాదళం అధికారులను సంప్రదించారు వారి సూచన ప్రాయంగా అంగీకారం తెలుపుతూ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు.


  మ్యూజియం గా మారనున్న యుద్ధనౌక
  ఐదు ఫ్లోర్లు మ్యూజియంగా తీర్చిదిద్ది కాకినాడ బీచ్ లో ఏర్పాటు చేయాలని గుడా అధికారులు నిర్ణయించారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఇందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి ప్లాన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నారు. కాగా తాంబరం స్టేషన్లో సేవలందిస్తూ నిష్క్రమించిన ఎయిర్ క్రాఫ్ట్ను కూడా పర్యాటక ఆకర్షణగా ఇక్కడికి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే స్టేషన్ అధికారులు లిఖితపూర్వకంగా అనుమతి ఇచ్చారు. దానికోసం బీచ్లో రూ. 50 లక్షలతో ప్లాట్ఫాం ప్రహరి నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. నెల రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

  సుదీర్ఘ సేవలందించి నిష్క్రమించిన యుద్ధనౌక ఎయిర్ క్రాఫ్ట్ లను పర్యాటకుల కోసం బీచ్ లో ఏర్పాటు చేసేందుకు మంత్రి కన్నబాబు సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే స్టేషన్ అధికారులు అందుకు అంగీకారం తెలపగా యుద్ధనౌక ఇచ్చేందుకు తూర్పు నౌకాదళం అధికారులు సుముఖంగా ఉన్నారు. బీచ్ ను పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం.

  - అమరేంద్రకుమార్ వైస్ చైర్మన్, గుడా