• Tags
  • మీకు బ్యాంకు అకౌంట్ ఉందా? NEFT, RTGS ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు తరచూ చేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఆన్ లైన్ బ్యాంకు అకౌంట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసింది. గురువారం (జూన్ 6, 2019) జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 

    ఆన్ లైన్ బ్యాంకు ఖాతాదారులు RTGS (రియల్ టైం గ్రాస్ సెటిల్ మెంట్ సిస్టమ్), NEFT (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్) వంటి లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. 

    ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు లావాదేవీలు జరిపినప్పుడు వినియోగదారులపై బ్యాంకులు విధించే కనీస ఛార్జీలను తొలగిస్తున్నట్టు సెంట్రల్ బ్యాంకు నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ ప్రకటనకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. డిజిటల్ పేమెంట్స్ మూమెంట్ ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో వినియోగదారులను ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. వారంలోగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు ఇవ్వనుంది.  

     

    ATM ఫీ, ఛార్జీలు మార్పులపై కమిటీ :


    ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు)లో ఫీ స్ట్రక్చర్ ను అంతర్గత మార్పులు చేయడంపై సమీక్షించేందుకు ఆర్బీఐ ఓ కమిటీని కూడా నియమించింది. ATMల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. పబ్లిక్ నుంచి డిమాండ్ మేరకు ఏటీఎం ఛార్జీలు, ఫీజుల్లో కూడా మార్పులు చేయాలని యోచిస్తోంది.

    దీనికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసిన ఆర్బీఐ సమీక్ష జరిపే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. వచ్చే రెండు నెలల్లో జరుగబోయే తొలి సమావేశంలో కమిటీ సిఫార్సులను సమర్పించే అవకాశం ఉంది. 

    మరోవైపు ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత రెపో రేటు 6.0 నుంచి 5.75 శాతానికి చేరింది.