• జిల్లాలో జరుగుతున్న వేసవి ఉచిత క్రీడా శిక్షణ కేంద్రాలకు సంబంధించిన పరికరాలు బుధవారం అందించనున్నట్లు సెట్రాజ్‌ సీఈవో మల్లిబాబు మంగళవారం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ శిబిరాలకు సంబంధించిన పరికరాలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో భద్రపరిచామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారుల సంఖ్య పెంచడానికి వేసవి ఉచిత శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 36 గ్రామీణ, 20 పట్టణ ప్రాంతాల్లో శిబిరాలు జరుగుతున్నాయని, వీరందరికీ ఆటను బట్టి ఆ క్రీడ నిపుణులు ప్రతిపాదించిన పరికరాలను కొనుగోలు చేశామన్నారు. అయిదు ఆటలకు సంబంధించిన క్రీడా పరికరాలు ఇంకా రావాల్సి ఉందని, త్వరితగతిన వాటిని అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని శిక్షణ శిబిరాల వద్ద తాగు నీరు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు.