You are here

Summative -2 Exams Starts from Today

 

Summative -2 Exams Starts from Today

 

 

 

జిల్లాలో సమ్మెటివ్‌-2(వార్షిక) పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధమైంది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాల్లోనూ సోమవారం నుంచి ఏప్రిల్‌ 22 వరకు వీటిని నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలను ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేశారు. 

 

 

తరగతి  విద్యార్థులు 
ఒకటో తరగతి  71,507
రెండో తరగతి  75,750
మూడో తరగతి  76,781
నాలుగో తరగతి  73,948
ఐదో తరగతి  73,817
ఆరో తరగతి  72,614
ఏదో తరగతి  72,877
ఎనిమిదో తరగతి  72,898
తొమ్మిదో తరగతి  72,876

 

నిర్వహణకు చర్యలు
జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న సమ్మెటివ్‌-2 పరీక్షలను సక్రమంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశాం. నిర్ణీత షెడ్యూలు ప్రకారం జరపాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రశ్నపత్రాలను మండల కేంద్రాలకు చేరవేశాం. పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత డీవైఈవోలు, ఎంఈవోలు పర్యవేక్షిస్తారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులున్నా నేరుగా తెలియజేస్తే చర్యలు తీసుకుంటా.
- ఎస్‌.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి

 

జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలు కలిపి 5,915 వరకూ ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఎయిడెడ్, మున్సిపల్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు ఇందులో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1,081 ఉన్నత పాఠశాలలు కాగా, మిగిలినవి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి 3,331 ప్రాథమిక, 420 ప్రాథమికోన్నత, 661 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి 486 ప్రాథమిక, 597 ప్రాథమికోన్నత, 420 ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ 6,63,068 మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. తొమ్మిదో తరగతి మినహా మిగతావారికి ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పేపరు-2 పరీక్షలు మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

 

కేంద్రాలకు చేరిన ప్రశ్నపత్రాలు

పరీక్షలకు సంబంధించి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) అన్ని మండలాలకు ప్రశ్న పత్రాలను తరలించింది. ఉన్నత పాఠశాలల ప్రశ్న పత్రాలు ఎంఆర్‌సీ కేంద్రాల్లో, ప్రాథమిక పాఠశాలల ప్రశ్న పత్రాలను స్కూల్‌ కాంప్లెక్స్‌లలో భద్రపరిచారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎంఈవో కేంద్రాల నుంచి ఏరోజు కారోజే ప్రశ్నపత్రాలను తీసుకెళతారు. డీవైఈవో, ఎంఈవోలు ఈ పత్రాలను తీసుకెళ్లి ఆయా పాఠశాలల్లో అందిస్తారు. ప్రాథమిక పాఠశాలల ప్రశ్నపత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, సీఆర్‌పీలు స్కూల్‌ కాంప్లెక్స్‌ల నుంచి తీసుకెళ్లి అందజేస్తారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా ఎంఈవోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

 

 

ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారంటే...

ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ పరీక్షలలో భాగంగా ఈనెల 15న తెలుగు పరీక్షను నిర్వహిస్తారు. 16న హిందీ, 17న ఆంగ్లం, 18న లెక్కలు, 20న సైన్స్, 22న సోషల్‌ పరీక్షలు జరుగుతాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం ఈ పరీక్షలన్నింటికీ మధ్యాహ్నం పూట పేపరు-2 పరీక్షలను నిర్వహిస్తారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఒక్క సైన్సు పరీక్షకే మధ్యాహ్నం పేపరు-2ను పరీక్ష ఉంటుంది. మిగిలినవన్నీ ఒకే పరీక్షగా నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకూ 17న తెలుగు పరీక్షను నిర్వహిస్తారు. 18న ఆంగ్లం, 20న లెక్కలు, 22న పరిసరాల విజ్ఞానం (ఈవీఎస్‌) పరీక్షలను నిర్వహిస్తారు.

Write a review

or login with

Advertisement

Share this content.