• విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ను జనవరి నెల 2020 సంవత్సరం నుంచి పూర్తిగా నిలిపి వేయనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపిన విషయం తెలిసిందే. దీని స్థానంలో అధునాతనమైన విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు విండోస్‌ 10లో కొత్త అంశాలు ఏమున్నాయి. విండోస్‌ 7కి దీనికి తేడా ఏమిటి? లాంటి విషయాలు చూద్దాం!

  విండోస్‌ 10కు మారాల్సిన అవసరం ఏంటి ?

  * విండోస్‌ 10లో స్టార్ట్‌ బటన్‌ ఉండదు. స్టార్ట్‌ బటన్‌కి బదులుగా మెట్రో యూఐ (మెట్రో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌) బటన్‌ ఉంటుంది. స్టార్ట్‌ బటన్‌లో ఉన్న అన్ని అప్లికేషన్లు, ఫోల్డర్లు డెస్క్‌టాప్‌ పైనే అనువుగా అందుబాటులో ఉంటాయి.  

  * విండోస్‌ 10లో టాస్క్‌ మేనేజర్‌ను పూర్తిగా కొత్తగా ఉంటుంది. దీనిని ఉపయోగించి ఏ సమయంలోనైనా  అనవసరమైన అప్లికేషన్‌ లేదా విండోను వెంటనే క్లోజ్‌ చెయ్యొచ్చు. ప్రస్తుతం దీనిని సులభతరంగా అర్థమయ్యేట్లు, ఎంత మెమొరీ దేనికి ఖర్చు అవుతుందో తెలిపే విండోతో ప్రవేశపెట్టారు.

  * ఏదైనా ఫైల్, డేటాను కాపీ లేదా మూవ్‌ ఒక ఫోల్డర్‌ నుంచి మరో ఫోల్డర్‌కు పంపించడం చెయ్యాలంటే విండోస్‌ 7లో చాలా సమయం పట్టేది. కానీ విండోస్‌ 10లో దానిని వేగాన్ని పెంచారు. కాపీ, మూవ్‌, డిలీట్‌కు సంబంధించిన విండోలో వాటి పేర్లను తొలగించి రన్నింగ్‌ యాక్షన్‌ అనే కొత్త విండోను తీసుకొచ్చారు. గతంలో ఒకేసారి రెండు మూడు ఫైళ్లను కాపీ చేస్తే వేరు వేరు విండోలో కాపీకి సంబంధించిన విషయాలు వచ్చేవి. కానీ విండోస్‌10లో ఒకే విండోలో అన్నీ కనిపిస్తాయి. 

  * సాధారణంగా విండోస్‌లో బూటింగ్‌ ప్రాసెస్‌లో సమస్యలుండటం సహజం. విండోస్‌ 7లో కంప్యూటర్‌ను బూట్‌ చెయ్యడానికి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కానీ, విండోస్‌ 10 కలిగిన కంప్యూటర్‌ను బూటింగ్‌ చేయడం చాలా సులభం. కంప్యూటర్‌ను రీస్టార్ట్‌ చెయ్యకుండానే, అది కూడా తక్కువ సమయంలోనే విండోస్‌ 10లో బూట్‌ చెయ్యొచ్చు. .

  * విండోస్‌ 7లో కొన్ని వెబ్‌సైట్లను తెరవాలంటే ప్లగిన్స్‌ తప్పనిసరి. కానీ విండోస్‌ 10లో ఎటువంటి ప్లగిన్స్‌ లేకుండా ఏ వెబ్‌సైట్‌నైనా తెరిచే విధంగా వీలు ఉంటుంది.

  * విండోస్‌ 7 కంటే ముందు కంప్యూటర్‌ను రెస్టోర్‌ చెయ్యాలంటే కమాండ్‌ ప్రాంట్‌ ద్వారా బూటింగ్‌ చెయ్యాల్సి వచ్చేది. ఇది కేవలం నిపుణులు మాత్రమే చేసేవారు. విండోస్‌ 10లో అత్యాధునికంగా సులభతరంగా ప్రతి ఒక్కరూ బూటింగ్‌ చేసే విధంగా దీనిని మార్చారు. 

  * విండోస్‌ 10 కలిగిన కంప్యూటర్‌లోకి మైక్రోసాఫ్ట్‌ ఆన్‌లైన్‌ అకౌంట్‌ను ఉపమోగించి లాగిన్‌ అవ్వచ్చు. ఇందులో ఐక్లౌడ్‌ ఆప్సన్‌ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో మీ డేటాను భద్రపరుచుకోవచ్చు. ఇతర కంప్యూటర్లను ఉపయోగించి మీ డేటాను వినియోగించుకోవచ్చు.

  * విండోస్‌ 7లో కంటే విండోస్‌ 10లో కంప్యూటర్‌ను రీసెట్‌ చేయడం చాలా సులభం. ఒకవేళ విండోస్‌ 7లో చెయ్యాలంటే బూటింగ్‌ ప్రాసెస్‌ ద్వారా చేయాల్సి వచ్చేది. కానీ విండోస్‌ 10లో సులభంగా ఫ్యాక్టరీ రీసెట్‌ చేసుకోవచ్చు. 

  ఎలా మారాలి? జాగ్రత్తగా...

  * మొదటగా మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో నుంచి విండోస్‌ 10 డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి విండోస్‌ 10 సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్‌ చేయాలి.

  * సేవ్‌ అయిన ఫైల్‌ని ఎంచుకుని నెక్ట్స్‌ బటన్‌ను ఫాలో అవుతూ మీ సిస్టమ్‌ ఓఎస్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. దీనికి సమయం కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. 

  * ఈ అప్‌డేట్‌ ఫైల్‌ సైజ్‌ 5 నుంచి 6 జీబీ ఉంటుంది కాబట్టి అంత మొత్తంలో డేటా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వైఫై ద్వారా ఓఎస్‌ అప్‌డేట్‌ చేయడం ఉత్తమం.

  * ఓఎస్‌ అప్‌డేట్‌ అవుతున్న సమయంలో కంప్యూటర్ సిస్టమ్‌ 5 నుంచి 7 సార్లు రీస్టార్ట్‌ అవుతుంది. 

  * ల్యాప్‌టాప్‌ ఓఎస్‌ అప్‌డేట్ చేస్తున్నట్లయితే బ్యాటరీ పూర్తిగా ఛార్జి చేసుకొని లేదా ఛార్జింగ్ లో పెట్టి తర్వాత అప్‌డేషన్‌ ప్రారంభిస్తే మంచిది. అప్‌డేషన్‌ మధ్యలో ఆగిపోతే మీ కంప్యూటర్‌ మొరాయించే అవకాశం ఉంది. 

  నాణ్యమైన భద్రత

  * మైక్రోసాఫ్ట్‌ చరిత్రలోనే అత్యంత బలమైన ఆపరేటింగ్‌ సిస్టంగా విండోస్‌ 7 పేరు తెచ్చుకుంది. భద్రత విషయంలోనూ ఉత్తమ ప్రమాణాలనే పాటించారు. ఇప్పుడు విండోస్‌ 10 భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

  * విండోస్‌ 7 ఓఎస్‌లో యాంటీ వైరస్‌ ఉండదు. దీని కోసం ప్రత్యేకంగా యాంటీ వైరస్‌ సాఫ్ట్వేర్ ఇన్‌స్టాల్‌ చెయ్యాల్సిందే.  విండోస్‌ 10లో ఓఎస్‌తోపాటు యాంటీ వైరస్‌ కూడా ఓ భాగమై ఉంటుంది. 

  * విండోస్‌ 7లో పాస్‌వర్డ్‌కు సంబంధించిన భద్రత బాగానే ఉండేది. విండోస్‌ 10 విషయంలో పాస్‌వర్డ్‌ భద్రతతో పాటు అవసరమైనపుడు వ్యాపారానికి సంబంధించిన డేటాలో పాస్‌వర్డ్‌కు బదులుగా బయోమెట్రిక్‌ వాడే సదుపాయం కల్పించారు. దీంతో పాటుగా ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ ఉపయోగించి కూడా పాస్‌వర్డ్‌ లేకుండా కంప్యూటర్‌లోకి లాగిన్‌ అవ్వచ్చు.

  * విండోస్‌ 7లో మనం డేటాను బ్యాకప్‌ తీసుకునే అవకాశం కల్పించారు. కానీ, డేటాను మనం బ్యాకప్‌ తీసుకోకుండా ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగి కంప్యూటర్‌ పాడైపోతే డేటాను వెనక్కి తీసుకోలేము. విండోస్‌ 10లో అత్యాధునికి సాంకేతికను ప్రవేశపెట్టారు. మన డేటాను ఐక్లౌడ్‌లో భద్రపరుచుకోవచ్చు. ప్రమాదవశాత్తూ కంప్యూటర్‌ పాడైనా వేరే కంప్యూటర్‌ నుంచి సమాచారాన్ని పొందవచ్చు.

  * కంప్యూటర్‌కు సంబంధించిన భద్రత మొత్తం విండోస్‌ 7లో సాఫ్ట్‌వేర్‌పైనే ఆధారపడి ఉండేది. ఈ సాఫ్ట్‌వేర్‌కి పొరపాటున వైరస్‌ వస్తే డేటా మొత్తం కోల్పోతాం. విండోస్‌ 10లో హార్డ్‌వేర్‌ భద్రతతో కూడిన యాంటీ వైరస్‌ను ఇందులో పొందుపర్చారు. దీంతో మన డేటా సురక్షితంగా ఉంటుంది.  

  ‘‘దేశంలోని చిన్న, మధ్య తరగతి సంస్థల్లో ఇంకా 61 శాతానికి పైగా కంప్యూటర్లలో విండోస్‌ 7నే వాడుతున్నారు. పాత సాఫ్ట్‌వేర్‌ కంప్యూటర్లను వాడటం సురక్షితం కాదు’’

  - మైక్రోసాఫ్ట్‌ ఇండియా డివైసెస్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఫర్జానా హాగ్‌.