• రోడ్డు మీద ఫోన్ పడేసుకుంటే మన అదృష్టం బాగుంటే దొరకొచ్చు. అదే సముద్రంలో ప్రయాణించే సమయంలో ఫోన్ అనుకోకుండా పడిపోయిందనుకోండి. దొరుకుతుందా? ఛాన్సే లేదు కదూ. కానీ సముద్రంలో జార విడుచుకున్న ఫోన్ ఓ మహిళకు తిరిగి దొరికింది. అదికూడా ఓ భారీ సముద్ర జీవి తెచ్చి ఇచ్చింది!!. 

    ఇటువంటి అద్భుతాలు నమ్మశక్యం కాకున్నా.. ఇలాంటివి నమ్మాల్సిందే. మరి ఆ ఫోన్ కథ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదూ.. ఈ అరుదైన అద్భుతమైన ఘటన నార్వేలోని హమ్మర్ఫెస్ట్‌లో జరిగింది.  సముద్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో మహిళ ఫోన్ జారిపడింది. ఫొన్‌ పోయిందని చాలా బాధపడింది. 

    సముద్రంలో తిరిగే వేల్ చేప ఆ ఫోన్‌ను నోటితో పట్టుకుని తిరిగి ఆమెకు అప్పగించడంతో సంతోషం వ్యక్తం చేసింది. మన్సికా అనే మహిళ తన ఫ్రెండ్స్ తో కలిసి హహ్మర్ఫెస్ట్‌లో సముద్రంలో అరుదైన సముద్ర జీవులను చూసేందుకు బోటుపై  షికారుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె  వేసుకున్న జర్కిన్ పాకెట్ లో ఉన్న ఫోన్ సముద్రంలో పడిపోయింది. ఇక ఫోన్ దొరకటం అసాధ్యమని ఆశలు వదిలేసుకుంది.

    ఫోన్ పడిపోయిన కొద్ది సేపటికి.. ఓ వేల్ (సముద్రాలలో ఉండే అతి పెద్ద చేప) ఆ  ఫోన్‌ను నోటితో పట్టుకుని పైకి తీసుకురావడం చూసి మన్సికాతో పాటు ఆమె స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన ఘటనను ఆమె స్నేహితురాలు ఇసా ఓప్దాల్ లర్సాన్ వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకు  1,60,000 వ్యూస్ వచ్చాయి.